అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? అని ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని, తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారని ఆక్షేపించారు. వైయస్సార్‌సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను అందించినట్లు తెలిపారు.
ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని మండిపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని దుయ్యబట్టారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారని మండిపడ్డారు.
ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదని విమర్శనాస్త్రాలు సంధించారు.
రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయని సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుందని ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుందని స్పష్టం చేశారు.
1.@ncbn గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?
2.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2025