ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే, 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే. కాగా, ఈరోజు బీహార్‌లోని గయలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోందని ఈసందర్భంగా స్పష్టం చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే, 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. దీనికి సంబంధించిన మూడు కొత్త బిల్లులను ఆయన గట్టిగా సమర్థించారు.
ఈ కొత్త చట్టాలను చూసి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవినీతి నిరోధక బిల్లుల పరిధిలోకి దేశ ప్రధాని కూడా వస్తారని ఆయన గుర్తుచేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, ఏ సీఎం, మంత్రి లేదా ప్రధానమంత్రి అయినా అరెస్ట్ అయిన 30 రోజుల్లోగా బెయిల్ తెచ్చుకోవాలని లేదంటే వారు తమ పదవిని వదులుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత చట్టాల ప్రకారం, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు అదుపులో ఉంటే సస్పెండ్ అవుతాడని, కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉంటూ కూడా అధికార ప్రయోజనాలను అనుభవిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇటీవల కాలంలో జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చూశామని, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నాయకుల తీరు ఇలా ఉంటే అవినీతిపై పోరాటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
By admin1 Min Read