హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, రాజకీయ నాయకులు, పౌర సమాజం, సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని తప్పుబడిస్తూ, విద్యా సంస్థల భూములను వాణిజ్య ప్రయోజనాలకు వాడడం అన్యాయమని ఆక్షేపిస్తున్నాయి.
ఈ వివాదంపై ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల, యాంకర్ రష్మీ గౌతమ్, నటి ఈషా రెబ్బా, ప్రియదర్శి, ప్రకాష్ రాజ్ లాంటి సినీ ప్రముఖులు భూముల పరిరక్షణకు మద్దతు తెలిపారు. ప్రకాష్ రాజ్ విద్యా సంస్థలకు కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం సరైంది కాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రేణూ దేశాయ్, రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
హెచ్‌సీయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు భూముల రక్షణ కోసం నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, పౌర సమాజం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించగా, భూముల భవిష్యత్తుపై ఆయన తీసుకునే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.