ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేబ్ బ్యాంకులో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. హాస్యం, విలనిజం, ఎమోషన్ ఇలా ఏ విభాగంలోనైనా తనదైన నటనతో మెప్పించారు.
తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్ (1996), గణేష్ (1998), చిన్న (2000), పృథ్వీ నారాయణ(2002), ఆ నలుగురు (2004), పెళ్లైన కొత్తలో (2006) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 2012లో చిత్రం వందే జగద్గురుమ్ సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్.. వెండి తెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు.
తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ‘ప్రాణం ఖరీదు’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.ఆయన మృతితో తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసింది.