విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నది పై ఉన్న రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచి నీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు వారికి వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ అవుతుందన్న దానిపై పవన్ ఆరా తీశారు. నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జల వనరుల శాఖ అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పాతకాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఈసందర్భంగా ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు వినియోగించుకుని గ్రామీణలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నీటి కాలుష్యాన్ని గల కారణాలు తెలుసుకోవాలని, దాని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశించారు. గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By Indu1 Min Read