ప్రస్తుత రోజుల్లో మహిళలను ఎక్కువగా ఇబ్బందిపెట్టే ఆరోగ్య సమస్య థైరాయిడ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్.. లావుగా మారడం లేదా సన్నగా కావడం ఇలా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. హర్మొన్ల సమస్యల వల్లే ఇది తలెత్తుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనిని ఎలా గుర్తించవచ్చు, ఒకవేళ థైరాయిడ్ వస్తే ఎలాంటి ఆహారం తినొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం..!
థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపో థైరాయిడ్, మరొకటి హైపర్ థైరాయిడ్. ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేకపోవడం.. వంటివి కనిపిస్తే దానిని ‘హైపో థైరాయిడిజం. సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం, నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తే దానిని ‘హైపర్ థైరాయిడిజం’గా పరిగణించి సంబంధిత రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
కనీసం ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకుని.. డాక్టర్లు ఇచ్చిన మందులు ఉపయోగించి దీనిని కాస్త అదుపులో ఉంచవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్లు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, సోయా, చిక్కుళ్లు.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయొడిన్, జింక్, ఇనుము, కాపర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఆకుకూరలు, చేపలు, పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. వాకింగ్, యోగా వంటి చేస్తుండాలి.