కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం తనకు ఆవేదన కలిగించిందన్నారు.
చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందని ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని దుయ్యబట్టారు.
వైయస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైయస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేసినట్లు వివరించారు.
సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉందని మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయని వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదని ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు.
ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయిందని ఆక్షేపించారు.
1.@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో… pic.twitter.com/6aXEQoRKqv
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2024