నిన్న పుష్ప–2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్‌లో పడింది.దీనికి హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు.అయితే థియేటర్ లో జనాల మధ్య తొక్కిసలాట జరిగింది.అల్లు అర్జున్ వస్తున్నాడని ముందుగానే తెలిసినా…తగిన చర్యలు మాత్రం తీసుకోలేదు.ఇప్పుడు ఈ అంశంపై కేసు నమోదైంది. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేశారు.అలాగే అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వని కారణంగా…బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ బృందంపై కూడా
తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. థియేటర్‌లోకి వచ్చే వారిని అదుపు చేసేందుకు ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు.రాత్రి 9.40 గంటలకు అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని,ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో వారిని నెట్టివేసిందన్నారు.అప్పటికే థియేటర్ లోపల, బయట కిక్కిరిసిపోయినట్లు చెప్పారు.ప్రేక్షకుల మధ్య తోపులాట జరిగిందని,ఈ ఘటనలో దిల్‌సుఖ్ నగర్ నుంచి వచ్చిన రేవతి కుటుంబం కిందపడినట్లు చెప్పారు.ఇది గమనించిన పోలీసులు వారిని పైకి లేపారని తెలిపారు.అయితే అప్పటికే రేవతి మృతి చెందిందని, 13 ఏళ్ల కొడుకు శ్రీతేజకు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించామన్నారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.