ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో నేడు సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని వెన్నెముక అని ఈసందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కలిగే లాభాలను వివరించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్లుగా భావించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకు నీరు అందించినట్లు తెలిపారు. నీటి సంరక్షణకు చర్యలు తీసుకుందామని అదే విధంగా సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.
పట్టిసీమను సంవత్సరంలో పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు అందించినట్లు తెలిపారు.ఓకే రోజులో 32 వేల క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు చేశాం. గతంలో 414 రోజుల్లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదని చురకలంటించారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం మేర పూర్తి చేసినట్లు వివరించారు. 28 సార్లు ప్రత్యక్షంగా ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. 80 సార్లకు పైగా ప్రాజెక్టుపై వర్చువల్గా సమీక్షించినట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు.
చేతకానితనం వల్ల గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ఆపేసింది. 2014-19 మధ్య మేం కష్టపడితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాశనం చేసింది. తొందరపాటు వద్దు అని కేంద్ర సంస్థ చెప్పినా.. గత ప్రభుత్వం వినలేదని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రానికి రూ. వేల కోట్లు నష్టం వాటిల్లింది. కేవలం 3.08 శాతం పనులు మాత్రమే చేసింది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రికి టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియదు. పోలవరం గురించి అడిగితే పర్సెంటా. అర పర్సెంటా అని అవహేళన చేశారని దుయ్యబట్టారు.
2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాయలసీమలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయి. పోలవరం ఎత్తు కచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుంది. 2014-19 మధ్య ప్రాజెక్టుపై రూ.16,493 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం కేవలం రూ.4,099 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జనవరి నుండి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభం కానుంది. 2026 మార్చిలోపు డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని. 2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.