ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా నేడు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు.
ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి అవకాశం ఉంది.
1964 డిసెంబరు 24న జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికై, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. 2021 సెప్టెంబరు నుండి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు.ఆయన అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు.కే ఎస్ ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఐఏఎస్ అధికారిగా వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా, సంజయ్ సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.
Previous Articleరామ్‌చరణ్,చిరంజీవికి థ్యాంక్యూ: నయనతార
Next Article ఘనంగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా