అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం తమదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతు బాంధవుడు, మాజీ ప్రధాని శ్రీ చౌదురీ చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని దేశం కిసాన్ దివస్ ను జరుపుకుంటున్న సందర్భంగా రైతు సోదరులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
రైతు కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం రైతులకు బాకీ పెట్టిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బును చెల్లించాం. అంతేకాకుండా ఈ ఏడాది ధాన్యం కొనుగోలును సులభతరం చేసి 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నాం. అగ్రి, ఆక్వా, హార్టికల్చర్ పంటల్లో సాంకేతికతను ప్రోత్సహించి సాగు ఖర్చులు తగ్గించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ను పునరుద్ధరించామని వివరించారు. మళ్లీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయడమే కాకుండా…నదుల అనుసంధాన స్వప్నాన్ని సాకారం చేసేందుకు శక్తిమేర పని చేస్తున్నామని ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని పీవీకి నివాళులు:
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. సంస్కరణలతో సంక్షోభ కాలాన్ని జయించి, దేశాన్ని ముందుకు నడిపించిన పాలనా సమర్థులు పీవీ నరసింహారావు గారని కొనియాడారు. దేశ ప్రధానిగా ఆయన అమలు చేసిన సంస్కరణలు దేశ గతిని మార్చాయని పేర్కొన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పించారు.