ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ-2025 విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఐసీసీ దీనికి సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్లోనే ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలో దిగుతాయి. త్వరలో షెడ్యూల్ రానుంది.
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ తో పాటు, తటస్థ వేదికగా కూడా జరుగుతుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక నాకౌట్ మ్యాచ్ లతో పాటు భారత్ ఆడే మ్యాచ్ లు తటస్థ వేదికలలో జరుగనున్నాయి. అలాగే రెండు దేశాలు నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలోని ఇరు దేశాల మ్యాచ్ లు 2027 వరకు తటస్థ వేదికలలోనే జరుగుతాయని జైషా నేతృత్వంలోని ఐసీసీ ప్రకటించింది.
ఈ నిర్ణయం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025, భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం ఇవ్వనున్న 2026లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కు వర్తిస్తుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2028కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి కూడా తటస్థ వేదిక నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా 2029 నుండి 2031 మధ్యకాలంలో ఐసీసీ మహిళల ఈవెంట్లలో ఒకదానికి ఆతిథ్యం ఇవ్వనుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
Previous Articleఉగండాలో కనుగొన్న ” డింగా డింగా ” వైరస్…!
Next Article ఇక వాట్సాప్ లో చాట్ జీపీటీ

