తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సత్తా చాటింది. కోనేరు హంపి న్యూ యార్క్ లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించి విజయం సాధించింది. 2019లో కూడా ఆమె ఛాంపియన్ గా నిలిచింది. చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా హంపి ఘనత సాధించింది. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది.
మరోవైపు భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్నా తరువాత వెనుకబడిపోయాడు. పురుషుల ర్యాపిడ్ ఈవెంట్లో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలాదర్ ముర్జిన్ 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. అర్జున్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ హంపికి అభినందనలు తెలిపారు. 2024 మన దేశ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Previous Articleపవన్‌కల్యాణ్‌ను ఇబ్బందిపెట్టకండి: నిర్మాణ సంస్థ విన్నపం
Next Article కుంభ మేళా.. భారీ డ్రోన్ షో

