ఆంధ్రప్రదేశ్ లో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఉద్దేశించి ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని ఆక్షేపించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఢిల్లీని తలదన్నే రాజధాని, పారిశ్రామిక కారిడార్లు స్థాపన పోలవరం వంటి అంశాల అమలుపై ప్రశ్నించారు. కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదని ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదని పేర్కొన్నారు. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని కూటమి నేతలని డిమాండ్ చేశారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని మోడీతో పలికించాలని స్పష్టం చేశారు.
మీరు మోడీ కోసం చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleభారత్ వేదికగా గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్ షిప్
Next Article వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట