ఐర్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత మహిళా క్రికెట్ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా నేడు జరిగిన మూడో వన్డేలో భారత్ 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వన్డేల్లో భారత మహిళా జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసింది. ప్రతీక రావల్ 154 (129;20×4, 1×6), స్మృతి మంథాన 135 (80; 12×4, 7×6) భారీ సెంచరీలతో కదంతొక్కారు. రిచా ఘోష్ 59 (42; 10×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్ 2 వికెట్లు, అర్లెన్ కెల్లీ, ఫ్రెయా సర్జెంట్, జార్జెనా డెంప్సే ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటయింది. సారా ఫోర్బ్స్ 41 (44; 7×4), ఓర్లా ప్రెండర్గాస్ట్ 36 (43; 6×4) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. దీప్తి శర్మ 3 వికెట్లు, తనూజా కన్వార్ 2 వికెట్లు, టైటాస్ సాధు, మిన్ను మనీ, సయాలీ సత్గరే ఒక్కో వికెట్ తీశారు. ఇక ప్రతీక రావల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కాయి. ఈ సిరీస్ లో ఆమె 310 పరుగులు చేసింది. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Previous Articleఅన్నపూర్ణ స్టూడియోస్ @50: నాగార్జున ప్రత్యేక వీడియో
Next Article సైఫ్అలీఖాన్ పై కత్తి దాడి…!