ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిని మురుగు కాలువగా మార్చారని ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగి తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై అఖిలేశ్ స్పందిస్తూ.. ముందు సొంత రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన సరిచూసుకోవాలన్నారు. ‘ఇతరులను సవాలు చేసే ముందు యూపీలో పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. మథుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు సిద్ధమా..?’ అని సీఎం యోగి పేరు ప్రస్తావించకుండా అఖిలేశ్ ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు.
గురువారం బీజేపీ తరఫున ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ప్రసంగించారు. ‘బంగ్లాదేశీయులు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను ఆప్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఢిల్లీని డంపింగ్ యార్డ్‌లా చేసింది. యమునా నదిని మురుగు కాలువగా మార్చింది. కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించా. ఇక్కడున్న యమునా నదిలో కేజ్రీవాల్ మునగగలరా..? దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.