అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ ఘనతను అందుకున్న 15వ బ్యాటర్ అయ్యాడు. దీంతో ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చేరాడతను. ఇండియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ సమయంలో.. స్మిత్ పది వేల పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. అయితే ఇవాళ శ్రీలంకతో ప్రారంభమైన టెస్టులో ఆ మైలురాయి దాటేశాడు.
టెస్టుల్లో పది వేల రన్స్ చేసిన బ్యాటర్లలో 15వ ప్లేయర్‌గా నిలిచాడతను. ఆస్ట్రేలియా తరపున నాలుగవ బ్యాటర్ అయ్యాడు. గతంలో పది వేల రన్స్ చేసిన ఆసీస్ బ్యాటర్లలో రికీ పాంటింగ్(13,378), అలన్ బోర్డర్(11,174), స్టీవ్ వా(10,927) ఉన్నారు. టెస్టుల్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అతను 15,921 రన్స్ చేశాడు.