భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే మూడేళ్లుగా విరాట్ కోహ్లీ నిలకడలేమి ఆటతో సతమతమవుతున్నాడు.గత 6 నెలలుగా అతని ప్రదర్శన మరీ పేలవంగా మారింది.పెర్త్ టెస్ట్ సెంచరీ మినహా కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.దీనితో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.జట్టులో నుండి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా విఫలమవడంతో భారత జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కొంది.కాగా అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేసింది.దీనితో సీనియర్ ఆటగాళ్లంతా రంజీ బరిలో నిలిచారు.అయితే మెడ నొప్పి గాయంతో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ..ఈరోజు ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు.
12 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.సౌరాష్ట్రతో ఢిల్లీలో అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ పోటెత్తారు.ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి క్యూ కట్టారు.కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా..అతనిపై అభిమానం మాత్రం ఏం తగ్గలేదని ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైంది.ఈ మేరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లుతోంది.భారీ సంఖ్యలో అభిమానులు హాజరవ్వడంతో అరుణ్ జైట్లీ స్టేడియం బయట క్యూ లైన్ రెండు కిలోమీటర్ల మేర ధాటింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.