చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని కేంద్రమంత్రి,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ…సమస్యను సృష్టించి బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు పార్లమెంటు లేదా కేంద్ర కేబినెట్‌లో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.అయితే అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బలపడకూడదనే కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు.దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధే మోదీ లక్ష్యమని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయపథంలో దూసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆరాటంలో భాగంగా, కాంగ్రెస్ డీలిమిటేషన్ పేరుతో బురద జల్లే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.డీలిమిటేషన్ అంశంపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న పార్టీల కుట్రలు విఫలం అవుతాయని చెప్పారు.కర్ణాటక,తమిళనాడు,తెలంగాణలో బీజేపీ విజయంపై పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

