ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కొన్ని ముఖ్యమైన మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు అవసరమైన ప్రభుత్వ నియంత్రిత మందులతోపాటు యాంటీబయాటిక్స్ ధరలు సుమారు 1.7 శాతం పెరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు, ఇతర ఉత్పాదన వ్యయాలు పెరుగుతుండటంతో, ఈ ధరల పెంపు ఫార్మా పరిశ్రమకు ఉపశమనం కలిగించగలదని అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టు సంఘం(ఏఐఓసీడీ) ప్రధాన కార్యదర్శి రాజవీ సింఘాల్ తెలిపారు.
అయితే, కొన్ని ఫార్మా కంపెనీలు అనుమతించిన ధరల పెంపు కన్నా అధికంగా ధరలు పెంచుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం గుర్తించింది. ఫార్మా డ్రగ్స్ ధరలను నిర్ణయించే నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) మొత్తం 307 ఉల్లంఘనలను గుర్తించిందని పేర్కొంది. 2013 డ్రగ్ ప్రైసెస్ (కంట్రోల్) ఆర్డర్ (డీపీసీఓ) ప్రకారం, ఫార్మా కంపెనీలు అనుమతించబడిన గరిష్ట ధరలను అతిక్రమించకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇకపై ప్రభుత్వం ఈ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

