భారత నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)పై ఆంక్షలు విధించాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) సిఫార్సు చేసింది. విదేశాల్లో సిక్కు వేర్పాటువాదులను హతమారుస్తున్నట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ‘రా’పై ఆంక్షలు విధించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, మైనారిటీల పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శిస్తూ, దేశాన్ని ‘ఆందోళన కలిగించే దేశం’గా ప్రకటించాలని సిఫార్సు చేసింది.
ఈ నివేదికపై భారత్ తీవ్రంగా స్పందించింది. యూఎస్ కమిషన్ ఆరోపణలను ఖండిస్తూ, ఇది నిరాధారమైన ఆరోపణ అని పేర్కొంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ‘రా’ కార్యకలాపాలు దేశ రక్షణకు అవసరమైన ప్రమాణాల ప్రకారమే కొనసాగుతున్నాయని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

