పెండింగ్ ఈ-చలాన్‌లు ఉన్న వాహనదారులు మూడు నెలల్లోపు జరిమానా చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ ఖాయమని ప్రభుత్వం హెచ్చరించింది.కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన తర్వాత,ఈ-చలాన్ రికవరీ రేటును పెంచేందుకు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కనీసం మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టంచేసింది.అదనంగా,జరిమానాలు చెల్లించని వాహనదారుల ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించింది.ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలు,స్పీడ్ గన్లు,బాడీ-వార్మ్ కెమెరాలు,ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలను మోటార్ వాహన చట్టంలోని 136ఏ సెక్షన్ కింద ఉపయోగించనున్నారు.
ఇక మద్యం తాగి వాహనం నడిపిన వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు. మొదటిసారి పట్టుబడితే ₹10,000 జరిమానా లేదా 6 నెలల జైలు కాగా, మళ్లీ అదే నేరానికి పాల్పడితే ₹15,000 జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. హెల్మెట్ లేకపోతే ₹1,000 జరిమానా, మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెన్షన్ ఉంటుంది. కారులో సీటు బెల్ట్ ధరించకపోతే ₹1,000 జరిమానా విధిస్తారు. ఇక మొబైల్ ఫోన్ ద్వారా డ్రైవింగ్ చేస్తే ₹5,000 జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.