అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై కొత్త వాణిజ్య సుంకాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.అమెరికాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లను ప్రకటించిన ఆయన,భారత్‌పై 26 శాతం,కంబోడియా ఉత్పత్తులపై 49 శాతం,చైనా ఉత్పత్తులపై 34 శాతం సుంకాలు విధించారు.ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారుతుందా లేదా అనే దానిపై కేంద్ర వాణిజ్య శాఖ పరిశీలన మొదలుపెట్టింది.అయితే,అమెరికా ఆందోళనలను పరిష్కరించగలిగితే,భారత్‌పై విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య అధికారులు భావిస్తున్నారు.
వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఈ ప్రతీకార సుంకాలను లిబరేషన్ డేగా అభివర్ణించారు.అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని, విదేశీ ఉత్పత్తులపై సుంకాలు పెంచడం వల్ల స్థానిక పరిశ్రమలు బలపడతాయని అన్నారు. ఇతర దేశాలు అమెరికాపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నామని పేర్కొన్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధించినట్లు తెలిపారు. ఈ చర్యల కారణంగా అమెరికాలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కంపెనీలు తిరిగి తమ దేశానికి రావడానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.