వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25 వేల మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా లోపభూయిష్టంగా ఉందని దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నియామకాలు సరిగా లేదని నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అంది. సదరు అభ్యర్థులు సంవత్సరాలుగా పొందిన వేతనాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, వారి నియామకాలను మాత్రం రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, 2016లో మమత సర్కారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, 24,640 పోస్ట్ లకు 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా పోస్టులు సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక తాజా సుప్రీం తీర్పుపై మమత స్పందించారు. బెంగాల్‌లో విద్యావ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం కోరుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. మోసపూరితంగా నియామకాలు పొందిన కొందరి వల్ల అభ్యర్థులందరినీ శిక్షించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
వెస్ట్ బెంగాల్ లో 25 వేల టీచర్ల నియామకాలు రద్దు…మమతా సర్కారుకు ఎదురు దెబ్బ
By admin1 Min Read