కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ఆసక్తికర ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఒకప్పుటి నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్-సుకుమా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఇద్దరు పిల్లలు మొబైల్ చూసుకుంటూ తమ ఇంటి బయట ఆడుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నక్సలిజం భయంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు వచ్చే వారు కాదని అయితే ఈరోజు ఆ పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ నిర్భయంగా ఫోన్ చూస్తున్న ఈ ఫోటో చూస్తుంటే ఆనందంతో హృదయం ఉప్పొంగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించే ఈ చిత్రాన్ని మీతో పంచుకుంటున్నానని ఆయన అన్నారు.
ఇక 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి 6కి తగ్గిందని, ఇది భద్రతా బలగాల చర్యలకు నిదర్శనమని ఇటీవల ఆయన పేర్కొన్నారు.ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టు హింస, భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంభిస్తోందని, ప్రధాని మోదీ నిర్ణయించుకున్న శాంతి స్థాపన లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అమిత్ షా ఇటీవల తెలిపారు.
ఈ ఫోటో అభివృద్ధి మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read