బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన మెసేజ్‌లో, ఒక వ్యక్తి తనను బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేస్తూ, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు చేసినట్లే ఆయన ఇంటిపైనా జరుపుతామని హెచ్చరించాడు. అలాగే, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్‌పై గౌరవంగా మాట్లాడాలంటూ చివరి హెచ్చరికగా పేర్కొన్నాడు. ఈ సందేశాన్ని పంజాబ్, చండీగఢ్ పోలీసులకు ట్యాగ్ చేసిన అభినవ్, తనతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.
ఇటీవలి కాలంలో అభినవ్ భార్య రుబీనా, అసిమ్ మధ్య వాగ్వాదం జరగడంతో, అభినవ్ అసిమ్‌పై విమర్శలు చేయగా, అతడి అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తాజాగా వచ్చిన మెసేజ్ కూడా అభిమానులే పంపినట్లు అభినవ్ ఆరోపించారు. ఈ ఘటనపై అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భయం నెలకొంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.