జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జె.ఎస్. చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనపై స్పందించిన సీఎం, ఉగ్రవాదుల దాడిలో తెలుగు కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం సమాజానికి మరక వంటివని అన్నారు. చరిత్రను గమనిస్తే, ఉగ్రవాదం, హింస ద్వారా ఏ లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టమవుతుందని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం తీసుకుంటున్న దృఢమైన, నిర్ణయాత్మక చర్యలకు తమ సంఘీభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు: సీఎం చంద్రబాబు
By admin1 Min Read