శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మత్య్సకార కుటుంబాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సముద్రతీరంలో మత్య్సకార కుటుంబంతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమ్యూనిటీ హాల్‌కు చేరుకుని చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులతో కాసేపు మాట్లాడారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.మత్స్యకార శాఖ ఏర్పాటు చేసిన వివిధ మత్స్యకార స్టాల్స్ ను సందర్శించారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుముకగా నిలిచిన వెనుకబడిన తరగతులకు అండగా నిలవడం తమ బాధ్యతని కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీ, ఎక్కడికి పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. దేశ సరిహద్దుల్లో రక్షణ సైన్యంలో కూడా శ్రీకాకుళం జవాన్లే అధికంగా ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద తలసరి ఆదాయం తక్కువ వచ్చేది శ్రీకాకుళం జిల్లాలోనే. ఈ జిల్లాను బాగుచేసే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమాజంలో వెనుకబడిపోయిన వర్గాల్లో మత్స్యకారులు కూడా ఉన్నారు. సముద్రాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నారు. 61రోజులు వేట విరామం సమయంలో మత్స్యకారులను ఆదుకోవాలని 2014-15లో మత్స్యకార భరోసాను ఇచ్చినట్లు తెలిపారు. 1,29,178 కుటుంబాలకు రూ.20వేలు చొప్పున మత్స్యకార భరోసాను ఈ యేడాది ఇచ్చామని వివరించారు.