శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, ఉదుకూరు గ్రామానికి చెందిన డి. నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు. ఆయన భార్య, తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమి అమరాపురం మండలం కె.శివరం గ్రామంలో ఉంది. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి, తన రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఈ భూమిని అక్రమంగా కబ్జా చేశారని నరసింహమూర్తి ఆరోపించారు. సరిహద్దుల్లో ఉంటూ తన కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో, ఆయన జమ్మూకశ్మీర్ నుంచే ఓ సెల్ఫీ వీడియో ద్వారా తన బాధని వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్మీ జవాను భూ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్… pic.twitter.com/iUjC56a676
— Lokesh Nara (@naralokesh) June 3, 2025
ఈ సెల్ఫీ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడి, భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, జవాను కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జవాన్ నరసింహమూర్తి కుటుంబానికి ఆ భూమిని అప్పగించారు. దీంతో, గత కొంతకాలంగా తీరని సమస్యగా ఉన్న ఈ భూ వివాదానికి కేవలం 24 గంటల్లోనే శాశ్వత పరిష్కారం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. “దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న మన సైనికుల సంక్షేమానికి, వారి కుటుంబాల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న జవాను తన భూమి కోసం ఆవేదన చెందాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని నరసింహమూర్తి ఆవేదన నా దృష్టికి వచ్చిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, 24 గంటల్లో సమస్యను పరిష్కరించామని తెలిపారు. సైనికులకు ఎలాంటి సమస్య తలెత్తినా, మా ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా నిలుస్తుందని లోకేష్ ఈసందర్భంగా స్పష్టం చేశారు.