నేడు 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖలో ఘనంగా యోగా డే నిర్వహించారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న వేళ యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. ఈ యోగా దినోత్సవం ‘మానవాళి కోసం యోగా 2.0’ కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆనందం, శాంతిని పెంపొందించడంలోయోగా ప్రాముఖ్యతను తెలిపారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
మానవాళి శ్వాస తీసుకోవడానికి, సమతుల్యం చేసుకోవడానికి, తిరిగి సంపూర్ణంగా మారడానికి అవసరమైన బ్రేక్ బటన్ యోగా అని ప్రధాని అభిప్రాయపడ్డారు. యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా, ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారాలని, ప్రతి దేశం, సమాజం యోగాను తమ జీవన విధానంలో, ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అదొక జీవన విధానమని అన్నారు. యోగాని సరళంగా నిర్వచించాలంటే కలపడం. ఇది ప్రపంచాన్ని కలిపిందని ఆయన వ్యాఖ్యానించారు.