మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను సీఎం పరిశీలించారు. క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఉత్పత్తులకు ఏ మేర డిమాండ్ ఉందని అడిగారు. చేనేత ఉత్పత్తులపై సెలబ్రిటీలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని డిజైనర్లు తెలిపారు. ఒక్క సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. చేనేత ఉత్పత్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించారు. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటన చేశారు.చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు తెలిపారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తామని అన్నారు. ముందు ముందు దీనిని 500 యూనిట్లకు పెంచుతామని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
నేతన్నలకు అండగా ఏపీ ప్రభుత్వం…50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read