రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులలో జో బైడెన్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఈ యుద్ధంలో “గేమ్ ఛేంజర్’ గా అభివర్ణించారు. రష్యాపై దాడికి అమెరికా తయారుచేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను తాము ప్రయోగిస్తే ఉక్రెయిన్ కు కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరుదేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆండ్రీ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య యుద్ధం 1000వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన యూఎన్ భద్రతా మండలి సమావేశానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు తాము అందిస్తున్న ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఆ దేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్ కు అవకాశం దక్కుతుంది. ఇక ఈ ఉద్రిక్తతలకు బైడెన్ ఆజ్యం పోస్తున్నారని మాస్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకుందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా విమర్శించారు. మూడో ప్రపంచయుద్ధం వైపు వెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. యూఎన్ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ-జనరల్ రోజ్మేరీ డికార్లో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించారు.

