భారతీయులు వీలైనంత ఎక్కువ మంది అమెరికాలో చదువుకునేందుకు, నివసించేందుకు వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లేదా విజయవాడ లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆమె ప్రజాసంబంధాల అధికారి అలెగ్జాండర్ మెక్ లారెన్తో కలసి తాజాగా విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తొలిస్థానంలో నిలిచింది. 2023-24 నాటికి 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులుండగా అందులో 56 శాతం ఏపీ, తెలంగాణకు చెందినవారేనని వివరించారు. తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం విద్యార్థులున్నారు.
ఈ వేసవి సీజన్లో హైదరాబాద్లో 47 వేలకు పైగా స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాం. దేశంలోని ఢిల్లీ రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్ కతాలతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్లో నాన్ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది వాషింగ్టన్లో మూడు నెలల పాటు ‘హెచ్1బీ డొమెస్టిక్ రీవాలిడేషన్ ప్రోగ్రాం’ను పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి అమెరికాలో నివసిస్తున్న 10 వేల మంది భారతీయుల హెచ్ 1బీ వీసాలను స్వదేశానికి రాకుండానే పునరుద్ధరించినట్లు వివరించారు. భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల సౌకర్యార్ధం వీసా ప్రక్రియను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నట్లు వివరించారు. విద్యార్థి, ఉపాధి, ఇతర వీసాల కోసం అపాయింట్మెంట్ కోసం వేచిచూసే సమయాన్ని మూడు నెలలకు తగ్గించగలిగినట్లు తెలిపారు. గతేడాది భారతీయులకు 14 లక్షల వీసాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీలో విశాఖ లేదా విజయవాడ లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
By admin1 Min Read