కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందనిఅమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. పలు అంశాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ ట్వీట్ చేశారు. దీనికి ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉంది అంటూ జగన్ కు చురకలంటించారు.
గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన జగన్ ది అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్ బాల్ ఆడుకుంది మీరే అంటూ లోకేష్ జగన్ పై మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నేను యువగళం పాదయాత్ర చేసేటప్పుడే మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించాం. ఇకపై ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నామని లోకేష్ ట్వీట్ చేశారు.విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం జగన్ దే అంటూ దుయ్యబట్టారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లలో మీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామంటూ లోకేష్ జగన్ ట్వీట్ కు బదులిచ్చారు.
1. చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉంది @ysjagan గారు! గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన… https://t.co/Lz39pk407C
— Lokesh Nara (@naralokesh) November 24, 2024