యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తమ మిత్రుల కోసం మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా ఉపయోగించడం ఆపాలని చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కు చెందిన ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశమయైన నేపథ్యంలో రాహుల్ కేంద్రం పై విమర్శలు చేశారు. ఈమేరకు‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా బదులిచ్చారు. ఆమె ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలు కష్టపడి పనిచేసే ఉద్యోగులు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలను అవమానించడమేనని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అమితాసక్తి అని అన్నారు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వ రంగం మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాకే బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చినట్లు తెలిపారు.
యూపీఏ ప్రభుత్వ పాలనలో విచక్షణా రహితంగా కార్పోరేట్ లోన్స్ మంజూరు చేయడం వల్ల బ్యాంక్ లు క్షీణించాయని విమర్శించారు. తమ వారి కోసం బ్యాంకులను ఏటీఎంల వాడుకున్నారని అప్పటి యూపీఏ పాలనను దుయ్యబట్టారు. ఉద్యోగులను వేధించారని మండిపడ్డారు. రూ.3.26 లక్షల కోట్లు గత పదేళ్ళలో బ్యాంకులకు మూలధనం గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 54 కోట్ల జన్ ధన్ ఎకౌంట్లు, పీఎం స్వానిధి, ముద్రా, విశ్వకర్మ వంటి పధకాల ద్వారా తనఖా లేని లోన్స్ మంజూరు చేసిన అంశాన్ని వివరించారు.
మోడీ ప్రభుత్వం వచ్చాకే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు: రాహుల్ వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ కౌంటర్
By admin1 Min Read