“బ్లూ లైట్” మధ్య చిక్కుకున్న మానవ నేత్రం
ఒకప్పుడు పగటి సమయంలో పనులు చేసుకునే వాళ్లం.. చీకటి పడుతూనే చల్లని చంద్ర కాంతి వెలుగులో నిద్రకు సన్నద్ధమయ్యే వాళ్లం. అది సహజమైన జీవనశైలి…కేవలం సూర్యకాంతిపై ఆధారపడి జీవించేవాళ్లం. సూర్యుడి నుండి వచ్చే సహజసిద్ధ కాంతే మనకు కనిపించే కాంతి…ఒక్క మాటలో చెప్పాలంటే మనిషీ ప్రకృతీ మమేకమై నడిచిన రోజులవి. కానీ ప్రస్తుతం రాత్రికి పూర్తి అర్థం మారిపోయింది. పగలు రేయి తేడా లేదు. వాణిజ్య పరమైన పోటీ, ప్రపంచీకరణ, సాంకేతికంగా వస్తున్న మార్పులతో రాత్రి కూడా పని సమయాలు జీవితాల్లోకి వచ్చేశాయి. ఇందులో భాగంగా మన జీవనశైలి మారిపోయింది. ముఖ్యంగా యువతలో పగటి జీవితం కంటే ఎక్కువగా రాత్రి మెలకువతో ఉంటూ దీనిని ఏదో గొప్ప ఘనతగా చెప్పుకొంటున్నారు కానీ దీనికి మనం చెల్లిస్తున్న మూల్యం కూడా ఎక్కువేనని వైద్యరంగ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. రాత్రి కృత్రిమ కాంతులు చూసి మన మెదడు భ్రమపడుతోంది. ఏది పనిచేసే సమయమో,ఏది విశ్రాంతి తీసుకునే సమయమో తెలియక గందరగోళపడుతోందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన చుట్టూ ఉన్న కృత్రిమ కాంతిలో ఉండే ‘బ్లూ లైట్’ వల్ల కొత్త సమస్యలకు ఆస్కారం ఏర్పడుతోందని పరిశోధనా రంగం గట్టిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మనం రోజంతా మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు,టీవీలు వంటి డిజిటల్ తెరల ముందు గడపటం వలన తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి కోసం జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాలతో సహా పరిశోధకులంతా హెచ్చరిస్తున్నారు.
టీవీలు, మొబైళ్లు,ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లు ఇలా మన లైఫ్ లో అధికభాగం ఏదో ఒక ‘స్క్రీన్’ ముందే గడిచి పోతోంది. మన జీవితాల్లో ఈ ‘స్క్రీన్ టైమ్’ అన్నది సగటున రోజులో 8 గంటలకు పైగా ఉంటోంది.ఈ స్క్రీన్‌లు నుండి వెలువడే “బ్లూ లైట్” వలన కంటికీ,శరీరానికి సమస్యలు తప్పవని పరిశోధనా రంగ నిపుణులు, అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రధానంగా ఈ బ్లూ లైట్ మన నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తిని, విడుదలను ప్రభావితం చేస్తుంది. దీనితో ‘నిద్రను -మెలకువలను నియంత్రించే సర్కాడియన్ రిథమ్ అస్తవ్యస్తమవుతుంది.ఇతర హార్మోన్లూ తీవ్రంగా దీనివలన ప్రభావితమవుతమయ్యే అవకాశం ఉంది. బ్లూ లైట్ నేరుగా కంటిలోని రెటీనా పొర మీద పడుతుంది.ఫలితంగా రెటీనా పొర బలహీనపడి చూపు సమస్యలు తలెత్తుతాయని కంటి వైద్యులు చెబ్బుతున్నారు.
మన కంట్లో ఉండే ‘రెటీనా’ పొర అత్యంత సున్నితమైనది. దీనికి ప్రమాదకరమైన కాంతి సోకటం మంచిదికాదు. అతినీలలోహిత కిరణాల వంటివాటిని మన కను గుడ్డు మీద ముందుండే తెల్లటి కార్నియా పొర, దాని వెనక ఉండే లెన్సు చాలా వరకూ అడ్డుకుంటాయి.కానీ ఇవి ‘బ్లూలైట్’ను మాత్రం ఆపలేవు. దీని వలన ‘బ్లూ లైట్’ నేరుగా కంటిలోకి ప్రవేశించి సున్నితమైన రెటీనా మీద పడి, దాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలం ఈ కాంతికి ప్రభావితమైతే నిదానంగా చూపు మందగించే ప్రమాదం ఉంది.ఇలా జరగడాన్ని ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ అంటారు. డిజిటల్ స్క్రీన్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉండేందుకు ఎల్‌ఈడీ తెరలను ఎక్కువగా వాడుతున్నారు. వీటి నుండి చాలా శక్తిమంతమైన బ్లూ లైట్ వెలువడుతుంది. రోజూ డిజిటల్ పరికరాలు వాడుతున్న వారిలో దాదాపు 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమతమవుతున్నారని ఓ అంచనా. ఇప్పుడు మన అందరి ఇళ్ళల్లో వాడుతున్న ఎల్‌ఈడీ లైట్ నుండి కూడా ఈ బ్లూ లైట్ వెలువడుతుంది.
రోజులో ఎక్కువ భాగం ఏదో ఒక డిజిటల్ స్క్రీన్‌ను, చాలా దగ్గరగా చూడటం వలన క్రమేణా పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోందని, దీని వలన ఒకప్పటి కంటే ప్రస్తుతం కంటి వ్యాధులు,నిద్ర సమస్యలు పెరిగిపోతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అవసరం ఉంటేనే వీటిని వాడాలి.మితిమీరి టివి ,మొబైల్స్,కంప్యూటర్స్ వాడకాన్ని తగ్గించాలి. వీటి వాడకాన్ని రాత్రిపూట నిద్రపోవడానికి కొంత సమయం ముందుగానే నిలిపి వేయాలి. చిన్నపిల్లలని వీలైనంత వరకు రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉంచాలి. వైద్యుల సూచన మేరకు వీటి ప్రభావం నుండి తట్టుకునే ప్రత్యేకమైన కళ్ళజోళ్ళను ధరించి ఉపయోగించాలి. వైద్యుల సలహాలు పాటించి కంటిని రక్షించుకోవాలి. రోజుకు ఎంత సమయం గడుపుతున్నామో పరిగణలోకి తీసుకుని స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం.