బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిందీ చిత్రం.పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు వచ్చింది.అయితే దీనికి బ్రిటన్‌లోనూ అడ్డంకులు ఎదురయ్యాయి.ఆ సినిమాను అడ్డుకోవడంపై తాజాగా భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
‘‘ఎమర్జెన్సీ చిత్రాన్ని అనేక సినిమా హాళ్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారంటూ వెలువడిన కథనాలు,నివేదికలు మా దృష్టికి వచ్చాయి.భారత వ్యతిరేక మూకలనుంచి వచ్చే బెదిరింపులు,హింసాత్మక నిరసనల వంటి అంశాలను మేం యూకే ప్రభుత్వం వద్ద లేవనెత్తుతూనే ఉన్నాం.ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలి.యూకే ప్రభుత్వం ఆ దిశగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం…భారత దౌత్యకార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాం’’ అని జైస్వాల్ పేర్కిన్నారు.