దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.సీఎం మమతా బెనర్జీ దీనిపై స్పందించారు.సంజయ్ రాయ్‌కు కోర్టు విధించిన శిక్ష పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు.నేను సంతృప్తి చెందలేదు.మనమంతా మరణశిక్షను డిమాండ్ చేశాం.కానీ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధించింది అని అన్నారు.
కాగా గత ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా తీసుకున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.ఒకవేళ కోల్‌కతా పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగించి ఉంటే నిందితుడికి మరణశిక్ష నిర్దారించేవారని అన్నారు.మరోవైపు సీబీఐ దర్యాప్తును మమతా బెనర్జీ ప్రశ్నించారు.వారు (సీబీఐ) దర్యాప్తు ఎలా నిర్వహించారో మాకు తెలియదు.రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసిన ఇలాంటి అనేక కేసుల్లో మరణశిక్ష విధించారు.ఈ శిక్ష పట్ల నేను సంతృప్తి చెందలేదు. మరణశిక్షను డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం కావాలి’ అని అన్నారు.