అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆప్‌కు చెందిన నలుగురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఇద్దరు కౌన్సిలర్‌లు రేఖా రాణి ,శిల్పా కౌర్ ఉన్నారు. రేఖా రాణి భజన్‌పుర నుంచి, శిల్పా కౌర్ ఖ్యాలా నుంచి ఆప్ కౌన్సిలర్‌లుగా ఎంపికయ్యారు.
మిగతా ఇద్దరిలో ఆప్ మాజీ ఎమ్మెల్యే శ్రీదత్ శర్మ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు పార్లమెంటరీ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఛౌదరి విజేంద్ర ఉన్నారు. శ్రీదత్ శర్మ 2015 నుంచి 2020 వరకు ఢిల్లీలోని ఘోండా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. వీరంతా బీజేపీ నేతలు హర్ష్ మల్హోత్రా, మనోజ్ తివారీ, కమల్‌జీత్ సెహ్రావత్ సమక్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీపడుతున్నాయి. దాంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నది. అయితే కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.