పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణస్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అదంతా అవాస్తవం. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో.. బహుమతిగానో వచ్చింది కాదు.అది మాది…మాకు మాత్రమే సొంతం’’ అని తెలిపారు.
గత సోమవారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు. పనామాకు ఇచ్చాం. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటాం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే ములినో స్పందించారు. అంతేగాక, ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు.

