అమెరికాలోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కరుణించాడు. కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లో తొలి వర్షం నమోదైంది. కొత్తగా మంటలు చెలరేగకుండా ఇది దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాలిపోయిన కొండప్రాంతాల నుంచి వచ్చే విషపూరిత బూడిద నీటి ప్రవాహంతో కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదముందనే ఆందోళన మొదలైంది.
అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం, ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్ ఏంజెలెస్ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వర్షం కురవనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలుకాగా.. మరో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.