బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాశ్ కనోజియా (31) అనే డ్రైవర్‌ను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అతడు నిందితుడు కాదని తేలడంతో పోలీసులు వదిలిపెట్టారు. ఆ తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని ఆకాశ్ తాజాగా పేర్కొన్నాడు. ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వెళ్లగక్కాడు.
‘‘ఆ కేసులో ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ మీడియాలో నా ఫొటోలు వచ్చాయి. అవి చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్‌లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్‌పుర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసు బృందం నాపై చేయి కూడా చేసుకున్నారు’’ అని ఆకాశ్ వాపోయాడు. పోలీసులు వదిలిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు తేల్చి చెప్పినట్లు వివరించాడు. గతంలో తనపై కేసులు ఉన్న మాట వాస్తవమేనని.. కాకపోతే ఈ దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.

