బోయింగ్ స్టార్‌లైనర్‌లో వెళ్లి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో వారు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా వారిని భూమి పైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేస్‌ఎక్స్‌ను కోరారని.. త్వరలో ఆ పని పూర్తి చేస్తామని పేర్కొంటూ మస్క్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు అప్పటినుంచి ఐఎస్‌ఎస్‌లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది. నాసా తాజా ప్రకటన ప్రకారం.. వారు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో భూమిని చేరుకునే అవకాశముంది.