మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది.ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) కార్యకర్తలు నిరసనలు చేపట్టాయి.ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే స్పందిస్తూ…ముంబైతో పాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు.ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ ఆయన స్పష్టం చేశారు.
అయితే తన వ్యాఖ్యలపై వివాదం ఏర్పడడంతో జోషి నిన్న వివరణ ఇచ్చారు.తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.మరాఠీ భాష ముంబై,మహారాష్ట్రకు చెందినదని ఆయన పేర్కొన్నారు.ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు,ఇతర భాషలు మాట్లాడేవారు కూడా మరాఠీని అర్థం చేసుకోవడం అవసరమని జోషి అన్నారు.నేను కూడా మరాఠీ వాడినేనని, ఇందుకు తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు.అయితే జోషి వ్యాఖ్యలపై పలువురు శివసేన యూబీటి నాయకులు మండిపడుతున్నారు.