అమెరికా దౌత్య కార్యాలయం భారతీయులకు షాకిచ్చింది. భారతదేశంలో భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.వీసా అపాయింట్‌మెంట్ వ్యవస్థలో లోపాలను గుర్తించిన అనంతరం మోసపూరిత కార్యకలాపాలకు సంబంధం ఉన్న 2 వేల అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.ఈ అపాయింట్‌మెంట్లు బాట్స్ (bots) ద్వారా బుక్ చేయబడినట్లు గుర్తించినట్లు తెలిపింది.ఏజెంట్లు, ఫిక్సర్‌ల వల్ల షెడ్యూలింగ్ ప్రక్రియ దెబ్బతింటోందని, ఇలాంటి అనైతిక చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతో పాటు,సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను సస్పెండ్ చేసినట్లు అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది.
అమెరికా వ్యాపార, పర్యాటక, విద్యార్థి వీసాలకు అపాయింట్‌మెంట్లు పొందేందుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే ఏండ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.అయితే ఏజెంట్ల సహాయంతో డబ్బు చెల్లిస్తే నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్లు లభిస్తున్నాయి.ఏజెంట్లు ప్రత్యేకమైన బాట్స్‌ను ఉపయోగించి అపాయింట్‌మెంట్ స్లాట్లను బ్లాక్ చేస్తుండటంతో, నేరుగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా తట్టుకోలేక ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.వీటి కోసం ఏజెంట్లు ఒక్కో వీసా దరఖాస్తుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఎఫ్-1 విద్యార్థి వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 2.79 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. 2014లో వీసా తిరస్కరణ రేటు 15 శాతమే ఉండగా, ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగింది.దీనివల్ల అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

