అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం కెనడాతో వాణిజ్య సంబంధాల్లో తీవ్ర ఒడిదుడుకులను తీసుకొచ్చింది. అమెరికాలోకి దిగుమతయ్యే వాహనాలపై 25% టారిఫ్ విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ చర్య కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
కెనడా ప్రధాని ఘాటుగా స్పందన
ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ చర్యతో అమెరికాతో మా పాత బంధం ముగిసింది.ఇది వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘన,’’ అని వ్యాఖ్యానించారు. కార్నీ అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి,ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతీకార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రతీకార వాణిజ్య చర్యలు తథ్యం
కెనడా తనదైన శైలిలో అమెరికాకు ప్రతిస్పందించేందుకు సిద్ధమవుతోంది. ‘‘అగ్రరాజ్యం విధించిన సుంకాలను తగిన ప్రతీకార చర్యలతోనే ఎదుర్కొంటాం. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలను విధించనుంది,’’ అని కార్నీ తెలిపారు.దీంతో అమెరికా-కెనడా వాణిజ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

