వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టం–2025పై సుప్రీంకోర్టు బుధవారం కీలక సూచనలు చేసింది. వక్ఫ్‌గా కోర్టులు గుర్తించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం తాత్కాలికంగా నిలిపివేసే ప్రతిపాదనను ధర్మాసనం పరిశీలిస్తోంది.అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించే నిబంధనపై కూడా స్టే విధించే అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.కేంద్రం తరఫున వాదనలు వినాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు.సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి ఏప్రిల్ 17న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని ప్రకటించింది.
వక్ఫ్ బై యూజర్ ప్రాక్టీస్‌పై ధర్మాసనం చర్చిస్తూ,పత్రాలు లేకపోయినా మతపరమైన ఉపయోగం ఆధారంగా ఆస్తులు వక్ఫ్‌గా గుర్తించడం సవాలుగా మారుతుందని వ్యాఖ్యానించింది.వాస్తవ వక్ఫ్‌లను గుర్తించడంలో కూడా సమస్యలు ఉండొచ్చని, దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.‘హిందూ ధార్మిక బోర్డుల్లో ముస్లింలను అనుమతిస్తారా?’అనే ప్రశ్నతో సుప్రీం కోర్టు కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్,అభిషేక్ సింఘ్వీ,రాజీవ్ ధావన్ వాదనలు వినిపించగా, వక్ఫ్ చట్టంపై దేశంలో జరుగుతున్న హింసాకాండ పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టసభలు న్యాయవ్యవస్థ తీర్పులను పక్కన పెట్టేలా వ్యవహరించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.