జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జరిగిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి వచ్చిన అతిథులను కాపాడటంలో తాను విఫలమయ్యానని ఈ దాడిలో మరణించిన 26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర హోదా కోసం తాను డిమాండ్ చేయబోనని పేర్కొన్నారు. పహల్గామ్ దాడిపై చర్చించేందుకు నేడు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. గతంలో ఇలాంటి దాడులు చూశాం. కానీ, పహల్గామ్‌లోని బైసరన్ లో ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం గత 21 ఏళ్లలో ఇదే మొదటిసారి. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఏవిధంగా క్షమాపణ చెప్పాలో కూడా తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పని తాను చేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు తన వద్ద మాటలు కరువయ్యాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా, పర్యాటక శాఖ మంత్రిగా వారిని కాపాడలేకపోయానని ఆయన ఆవేదన చెందారు. ఉగ్రవాదంపై పోరులో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలు మాకు మద్దతు ఇస్తేనే మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతమవుతాయని స్పష్టం చేశారు.
టూరిస్ట్ లను కాపాడడంలో విఫలమయ్యా…జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భావోద్వేగం
By admin1 Min Read