గవర్నర్ గారి ప్రసంగం అనంతరం ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ …వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో రాదు.ఫిక్స్ అయిపోండి.అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారో, నేనో కావాలని చేసింది కాదు.ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం, మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాల’ని స్పష్టం చేశారు.భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయింది.ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభా సమయం వృథా చేస్తున్నారు.సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయి.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు.
ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించారు.అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటారని, ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉంటుందని వైసీపీవాళ్లు గ్రహించాలన్నారు.గవర్నర్ గారి ప్రసంగం సమయంలో వైసీపీ తీరు బాధాకరం
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా డిమాండు పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు.గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోయినా బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆయన ప్రసంగించేందుకు వచ్చారు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిస్థాయిలో వినకుండా వైసీపీ నానా యాగీ చేసింది. ప్రసంగ ప్రతులు చింపేయడం,ప్రసంగం మధ్యలో వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదు.వారు అనుసరిస్తున్న వైఖరి నిజంగా బాధాకరం. గవర్నర్ గారి ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండానే వైసీపీ నాయకులు ఇష్టానుసారం అరుపులు, కేకలు వేయడం వారి తీరును బయటపెడుతోంది.
ముందు అసెంబ్లీకి వస్తే కదా సమయం ఎంత ఇస్తారో తెలుస్తుంది
వైసీపీ నాయకుడు, వారి ప్రజాప్రతినిధులు మొదట అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలి. ప్రజల సమస్యలపై స్పందించాలి. హుందాగా చర్చల్లో పాల్గొనాలి. మొదట వైసీపీ నాయకుడు సభకు వస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో తెలుస్తుంది. అసలు సభకే రాకుండా, రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్లు చేయడం అనేది పూర్తిగా అనైతికం. మొదటి సమావేశాల్లోనే వైసీపీ నాయకులకు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, నేను తగిన గౌరవం ఇచ్చాం. 11 సీట్లే వచ్చాయని వారిని ఎవరూ తక్కువ చేసి చూడలేదు. తగిన మర్యాద ఇస్తున్నాం. అయితే అసెంబ్లీకి రాకుండా మాకు సమయం ఇవ్వరు… మేం మాట్లాడలేం అని మాటలు చెప్పకుండా అసెంబ్లీకి వచ్చి చూస్తే సమయం ఎంత ఇచ్చారు..? మీరు ఎం మాట్లాడారో కూడా ప్రజలకు తెలుస్తుంది.
ప్రోటోకాల్ ను ఎవరైనా పాటించాల్సిందే
ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలను ఎవరైనా పాటించాల్సిందే. ప్రోటోకాల్ మేరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో మంత్రుల వరుసలోనే కూర్చొన్నాను.అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో కూడా గవర్నర్ గారిని ఆహ్వానించేందుకు రావాలని తెలిపినా- ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్, ముఖ్యమంత్రి, శాసనమండలి ఛైర్మన్ వెళ్తారు అని నేను వెళ్లలేదు.ఎవరైనా ఆ ప్రొటోకాల్ ను పాటించాల్సిందే.దీన్ని వైసీపీ నాయకులు గమనించాలి.మీకు ప్రజలు ఇచ్చిన సీట్ల సంఖ్య ప్రకారం మాత్రమే హోదా దక్కుతుంది. దాని ప్రకారం అసెంబ్లీలో మాట్లాడేందుకు, ప్రజా సమస్యలు చర్చించేందుకు తగిన సమయం ఇస్తారనేది గుర్తుంచుకోవాలి” అన్నారు