ఎన్నికల ప్రచారంలో, వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. ప్రజలు ఆశీర్వదించారు. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకుంటూ, వర్గీకరణ నిజం చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. బుడగ జంగాలని ఎస్సీలో చేర్చాలని ఒక తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు. 2026లో వచ్చే సెన్సెస్ ప్రకారం, జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని వివరించారు. ఏడుగురు జడ్జిల సుప్రీం కోర్టు బెంచ్ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిందని అది రాగానే ఆర్ ఆర్ మిశ్రా కమిషన్ వేసాం. వారు అందరితో చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా, మూడు కేటగిరీల్లో వర్గీకరణ చేయాలని రిపోర్ట్ వచ్చిందని చెప్పారు . 1995లో సీఎం అయ్యాక ఎస్సీల పట్ల వివక్ష బాగా ఉండేది. అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ను మా హాయంలో వేశాం. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశాం. ఎస్సీల కోసం జస్టిస్ పున్నయ్య ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారని పేర్కొన్నారు. అంటరానితనం, కుల వివక్ష పైన ఒక యుద్ధం చేసామని వివరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేశాం. సాంఘిక సమానత్వంపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించాం. ప్రతినెల, ప్రతిగ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాం. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదటి కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు, ఇప్పుడు వర్గీకరణ అమలు చేసే వరకు ఉండటం అదృష్టమని అన్నారు.
చెప్పిన మాట నిలబెట్టుకుంటూ, వర్గీకరణ నిజం చేసి చూపించాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read